అమెరికా కఠిన చర్యలు
‘డంకీ రూట్’ ద్వారా అక్రమంగా ప్రవేశించిన 54 మంది భారతీయులు బహిష్కరణ

న్యూ ఢల్లీి, అక్టోబర్ 27: అమెరికాలో అక్రమ వలసలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో, ‘‘డంకీ రూట్’’ ద్వారా దేశంలోకి ప్రవేశించారనే ఆరోపణలపై 54 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. స్వదేశానికి వెనక్కి పంపబడిన వారిలో అధికశాతం హర్యాణా రాష్ట్రానికి చెందిన యువకులే కావడం గమనార్హం.
బహిష్కరణకు గురైన వారిలో 16 మంది కర్నాల్‌కు చెందినవారు, 15 మంది కైతాల్‌కు చెందినవారు ఉన్నారు. అలాగే అంబాలా (5), యమునా నగర్ (4), కురుక్షేత్ర (4), జింద్ (3), సోనిపట్ (2), పంచకుల, పానిపట్, రోహ్తక్, ఫతేహాబాద్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీరంతా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారేనని, ఢల్లీిలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.
ఈ 54 మంది అక్రమంగా ‘డంకీ రూట్’ ద్వారా అమెరికాలోకి ప్రవేశించినట్లు కర్నాల్ డీఎస్పీ సందీప్ కుమార్ తెలిపారు. బహిష్కరణకు గురైన వారందరినీ పోలీసుల ద్వారా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి పెద్ద సంఖ్యలో స్వదేశాలకు పంపిస్తున్నారు. ఈ ఏడాది కూడా వేల సంఖ్యలో అక్రమవలసదారులను దేశం నుంచి బహిష్కరించినట్లు సమాచారం.
