వ్యవసాయ రంగం సంక్షోభం

దేశ జనాభాలో సుమారు 55 శాతం మంది నేరుగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడిపోతున్నారు.

On

download

భారతదేశం ఒక వ్యవసాయ ప్రధాన దేశం. దేశ జనాభాలో సుమారు 55 శాతం మంది నేరుగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడిపోతున్నారు. కానీ ఈ రంగం ప్రస్తుతం తీవ్రమైన కష్టాల్లో చిక్కుకుంది. ఒకప్పుడు ‘‘అన్నదాత’’గా గౌరవించబడిన రైతు, ఇప్పుడు అప్పుల బారిన పడి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి చేరుకున్నాడు. వర్షాలపై ఆధారపడే పంట వ్యవస్థ, మార్కెట్‌లో అస్థిర ధరలు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం - ఇవన్నీ కలసి వ్యవసాయాన్ని లాభరహిత రంగంగా మార్చేశాయి. పంట పండిరచినా రైతు నష్టపోవడం, పండిరచకపోయినా నష్టపోవడం అనేది ఈ రంగానికి నేటి వాస్తవ చిత్రం. ప్రకృతి మార్పులు కూడా వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. గత కొన్నేళ్లుగా వర్షాల విధానం పూర్తిగా మారిపోయింది. ఎప్పుడు కురిసినా వరదలు, లేకుంటే కరువు అనే రెండు అతి పరిస్థితులు రైతును భయపెడుతున్నాయి. ఒకే పంటకు విత్తనాలు వేసినా వర్షాల కొరతతో పంట విఫలం కావడం, పంటలు మునిగి నష్టపోవడం తరచుగా జరుగుతోంది. ఈ కారణంగా రైతు ప్రతి సీజన్‌కి ముందు ‘‘ఈసారి వర్షం ఎలా ఉంటుంది?’’ అని భయపడుతున్నాడు. పంటలకు సరైన నీటి వనరులు లేకపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో పొలాలు పాడైపోతున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నా, వాటి ప్రయోజనం రైతు వరకూ సరిగా చేరడం లేదు. ఆర్థిక పరంగా చూస్తే రైతు స్థితి మరింత దయనీయంగా ఉంది. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, డీజిల్‌, కార్మికుల వేతనాలు అన్నీ రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. పంట పండిరచే ఖర్చు భారీగా పెరిగినా, మార్కెట్‌లో ధర మాత్రం పెరగడం లేదు. రైతు చెమటోడ్చి పండిరచిన పంటకు మధ్యవర్తులు, మిల్లర్లు, వ్యాపారులు అధిక లాభాలు సంపాదిస్తుండగా, నిజమైన కష్టజీవి రైతు చేతిలో మాత్రం తగినంత లాభం మిగలడం లేదు. ప్రభుత్వ మద్దతు ధరలు కూడా చాలా పంటలకు వర్తించకపోవడం రైతు నిరాశకు కారణం. పంటల బీమా పథకాలు, రైతు బంధు వంటి పథకాలు ఉన్నా అవి సరిగా అమలు కావడం లేదు. బీమా సంస్థలు పరిహారం చెల్లించడంలో ఆలస్యం చేస్తాయి. కొన్నిసార్లు పరిహారం రాకపోవడంతో రైతులు దెబ్బతింటున్నారు. ఒక పంట విఫలమైతే, దాని నష్టాన్ని తట్టుకునే స్థోమత రైతుకు ఉండదు.

ఈ స్థితి అతనిని అప్పుల బారిన పడేలా చేస్తుంది. గ్రామీణ రుణ వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవడంతో రైతులు మళ్లీ ప్రైవేట్‌ అప్పులపై ఆధారపడుతున్నారు. ఈ దుష్ప్రభావం రైతు కుటుంబం మొత్తానికీ తీవ్ర సమస్యలను తెచ్చిపెడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయంలో ఉపయోగపడే అవకాశం ఉన్నా, గ్రామీణ స్థాయిలో రైతులకు అవగాహన లేకపోవడం పెద్ద అడ్డంకిగా మారింది. డ్రిప్‌ ఇరిగేషన్‌, స్మార్ట్‌ ఫార్మింగ్‌, డ్రోన్ల ద్వారా పంట పరిశీలన వంటి ఆధునిక పద్ధతులు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అందుబాటులో లేవు. ప్రభుత్వ వ్యవసాయ శాఖలు, పరిశోధనా కేంద్రాలు రైతులకు ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ఇచ్చే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. పంటల ఎంపిక, నేల తత్వం, నీటి వినియోగం వంటి అంశాలలో శాస్త్రీయ మార్గదర్శకాలు అందిస్తే రైతులు మరింత లాభపడగలరు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ ఆధారిత మార్కెట్‌ వ్యవస్థ అవసరం. రైతు ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసి ఎగుమతి చేయగల విధంగా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి. కోల్డ్‌ స్టోరేజ్‌ సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, నేరుగా రైతు నుంచి వినియోగదారుడికి చేరే మార్కెట్లు ఏర్పాటైతే రైతుకు నిజమైన లాభం దక్కుతుంది.

మద్యవర్తుల ఆధిపత్యం తగ్గితే రైతు ఆదాయం పెరగగలదు. ఇది సాధ్యమైతేనే వ్యవసాయం తిరిగి స్థిరపడుతుంది. ప్రభుత్వాలు ప్రతి ఎన్నికల్లో రైతు సంక్షేమం పేరుతో హామీలు ఇస్తున్నా, అమలు మాత్రం సగం మాత్రమే జరుగుతోంది. రైతు సమస్యలను తాత్కాలికంగా పరిష్కరించే బదులు దీర్ఘకాలిక దిశగా ప్రణాళికలు అవసరం. నీటి వనరుల సమర్థ వినియోగం, రైతు విద్య, మార్కెట్‌ సంస్కరణలు, సాంకేతిక సహాయం ఇవన్నీ సమగ్రంగా అమలు అయితేనే రైతు నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. రైతు భవిష్యత్తు భద్రంగా ఉండటం అంటే దేశ భవిష్యత్తు భద్రంగా ఉండటం. రైతు లేకుండా దేశం బతకదు, ఆహార భద్రత కూలిపోతుంది. కాబట్టి వ్యవసాయ రంగాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. రైతు చెమట చుక్కతో పుడుతున్న అన్నం విలువైనదని మనం గుర్తించాలి. రైతు చిరునవ్వు మళ్లీ కనిపించే రోజు రావాలంటే, అతనికి గౌరవం, భరోసా, భద్రత ఇవ్వడం మన సమాజపు తొలి కర్తవ్యం.

Tags:

Advertisement

Latest News

వ్యవసాయ రంగం సంక్షోభం  వ్యవసాయ రంగం సంక్షోభం
భారతదేశం ఒక వ్యవసాయ ప్రధాన దేశం. దేశ జనాభాలో సుమారు 55 శాతం మంది నేరుగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడిపోతున్నారు. కానీ ఈ రంగం ప్రస్తుతం...
సోషల్‌ మీడియా ప్రభావం సమాచార యుగం సత్యం మరియు అపోహలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
సీక్రెట్‌ వీడియోలే కొంప ముంచాయి
అమెరికా కఠిన చర్యలు
పోలీసు త్యాగాలకు గౌరవ వందనం